హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే సీఎంగా అయ్యానని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలువాల్సిందేనని, అందుకు పార్టీ శ్రేణులు ఎన్నికల యుద్దానికి సన్నద్ధం కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలది, నాయకులేదనన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి ఢిల్లీకి పంపించారని అన్నారు. 2,964 బూత్ లలో ప్రతీ బూత్ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేసి నన్ను గెలిపించారన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి అని, ఇక్కడ విస్తీర్ణంతో పాటు ఓటర్లు కూడా అధికమేనన్నారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని తెలిపారు.
వందరోజులు పాలనపైనే దృష్టి..
కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టినట్లు రేవంత్ తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలుకు శ్రీకారం చట్టామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ప్రభుత్వానిదన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంఖుస్థాపన చేసునుకున్నామని, మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా, జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్ లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని, అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది.పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలన్నారు.
త్వరలోనే అభ్యర్థుల ప్రకటన..
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం బిజీ బిజీగా ఉందని, హొలీ పండగలోగా అభ్యర్థులను ప్రకటిస్తుందని రేవంత్ తెలిపారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదని వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని సూచించారు. వారికి పోలింగ్ బూత్ ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలని సూచించారు. శుక్రవారంలో సాయంత్రం కంటోన్మెంట్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలన్నారు. ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందేనని సూచించారు. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలని సూచించారు.మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఈ ఎన్నిక అభ్యర్థిది కాదని, నా ఎన్నిక అని రేవంత్స్పష్టం చేశారు. నా బలం.. నా బలగం మీరేనని ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని అందుకు అనుగుణంగా ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు.