ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మరో వారం రోజుల్లోనే IPL 2024 ప్రారంభంకానుంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఈ మెగా లీగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోసారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ బరిలోకి దిగనుంది. గతంలో కోల్‌కతాకు కెప్టెన్‌గా రెండు ట్రోఫీలు అందించిన గౌతం గంభీర్ ఈ సారి జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో ఈ సారి కోల్‌కతా పాజిటివ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగనుంది. కానీ, ఇంతలోనే కోల్‌కతా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. పలు నివేదికల ప్రకారం.. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం మరోసారి తిరగబెట్టింది. దీంతో అతను ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేయకపోవచ్చని తెలుస్తోంది. కాగా వెన్ను నొప్పికి గతేడాది శ్రేయాస్ అయ్యర్ శస్త్ర చికిత్స కూడా చేయించుకున్న విషయం తెలిసిందే.