ప్రతిపక్షం, సిద్దిపేట, జూలై 03: ఏఐఎస్‌బి ఆధ్వర్యంలో జులై 4న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ నిర్వహించనున్నట్లు ఏఐఎస్‌బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని, నీట్ నెట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలనీ కొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 7100 కోట్ల రూపాయలు బోధన రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టడం పై ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా విద్య హక్కు చట్టాన్ని అమలు చేస్తూ ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలన్నారు. రేషలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలను ముసివేయడం ఆపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీ లలో ఖాళీ ఉన్న వి. సి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుమార్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.