Trending Now

ఇవి దేశ భవిష్యత్​ ను నిర్ణయించే ఎన్నికలు: కిషన్​ రెడ్డి

ప్రతిపక్షం, హైదరాబాద్: ​ఢిల్లీ ఎన్నికల్లో మోదీకే ఓటు వేసి మరోసారి ప్రధానమంత్రిని చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ జి. కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్​ ను నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తార్నాక డివిజన్ సత్య నగర్ పూలే విగ్రహనికి పూల మాల వేసి జీప్​ యాత్రను ప్రారంభించారు. శ్రీపురి కాలనీ, చంద్రబాబు నగర్, ఇందిరానగర్, మీదుగా లాలాపేట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడ స్థానిక ప్రజలను ఉద్దేశించి స్ట్రీట్​ కార్నర్​ మీటింగ్​ లో మాట్లాడారు. అనంతరం లాలాపేట్ లేబర్ అడ్డా, వినోబా నగర్. విజయ డెయిరీ, చింతల్ బస్తి, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్, నారాయణ కాలేజ్ స్ట్రీట్, విజయపురి కాలనీలో పర్యటించారు. మెట్టుగూడ డివిజన్ లో శివాలయం, ముద్ర సంఘం, బొందల గడ్డ గవర్నమెంట్ నుంచి మెట్టుగూడ వైజంక్షన్​ వరకు కొనసాగిన యాత్రలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘‘500 ఏండ్ల నాటి కలను నెరవేరుస్తూ.. ప్రధాని మోదీ దివ్య, భవ్యమైన రామ మందిరాన్ని నిర్మాణం చేశారు. దేశంలో ప్రతి పేద కుటుంబానికి వంట గ్యాస్ కనెక్షన్, ఉజ్వల పథకం అమలు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా దేశంలో13 కోట్ల టాయిలెట్లు కట్టించారు మోదీ. కోట్లాది మంది పేదలకు ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. రైల్వేలు, జాతీయ రహదారులు, ఎయిర్​ పోర్టుల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి సహకారం, ముద్రా రుణాలు ఇలా.. గత పదేండ్లలో ఎంతో చేశారు. అందుకే మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి”అని కిషన్​ రెడ్డి కోరారు.

ఎన్నికల్లో గెలిచేది మోదీనే..

‘‘ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేది కమలం పార్టీ.. గెలిచేది మోదీ.. దేశగౌరవాన్ని పెంచేది మోదీ.. పేదలకు అండగా నిలిచేది మోదీ.. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు”అని కిషన్​ రెడ్డి అన్నారు. చట్ట సభల్లో మహిళలకు33 శాతం రిజర్వేషన్​ తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీది అని ఆయన గుర్తు చేశారు. ‘‘ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఆర్మీ, ఎయిర్​ ఫోర్స్​ లో పనిచేస్తూ దేశ రక్షణలో ఉన్నారు. మోదీ వారికి అన్ని రంగాల్లో అవకాశాలు పెంచారు. ముస్లిం మహిళలకు అండగా నిలిచేందుకు మోదీ త్రిపుల్ తలాక్ పద్ధతిని రద్దు చేశారు. ముస్లిం ఆడబిడ్డల మెడపై కత్తిలా వేలాడే ఆ విధానాన్ని మోదీ తొలగించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. మళ్లీ త్రిపుల్ తలాక్ మళ్లీ తెస్తామని అంటున్నది. దీనిపై ముస్లిం ఆడబిడ్డలే సమాధానం చెప్తారు. కరోనా కష్టకాలంలో దేశ ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత ప్రధాని మోదీది. ఆ సమయంలో ప్రారంభించిన ఉచిత బియ్యం ఇప్పటికీ ఇస్తున్న విషయం తెలిసిందే. పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు లోన్​ ఇస్తున్నది కేంద్రం. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 720 కోట్లు మంజూరు చేయడమే కాకుండా.. ప్రధాని స్వయంగా స్టేషన్​ ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. ఎయిర్​ పోర్టు తరహాలో ఈ స్టేషన్​ అత్యాధునిక వసతులతో అందుబాటులోకి రానుంది. దేశం కోసం మోదీకి ఓటు వేయండి.. సికింద్రాబాద్​ నుంచి మరోసారి నన్ను ఆశీర్వదించండి”అని కిషన్​ రెడ్డి కోరారు.

Spread the love

Related News

Latest News