ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించడాన్ని ఆయన కొనియాడారు. ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని అన్నారు. ‘పోలండ్, ఉక్రెయిన్‌లో మోదీ ఇటీవలి పర్యటన గురించి చర్చించడానికి ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి. ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మేం మా నిబద్ధతను పునరుద్ఘాటించాం’ అని ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కాగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచే ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నించారు. యుద్ధం వల్ల ఒరిగేమీ లేదని, చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని పలు సందర్భాల్లో ఇరు దేశాలకు సూచించారు. ఇక, ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో పర్యటించిన మోదీ.. యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలు జరిపి ఓ పరిష్కారానికి రావాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచించారు.