ప్రతిపక్షం, సిద్దిపేట, మే 16: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని చండ్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ లో బుధవారం రాత్రి యువతి మృతదేహన్నిగుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను సిద్దిపేట పట్టణం శంకర్ నగర్ కు చెందిన ఇరుగదిండ్ల అశ్విని (22) గా గుర్తించారు. అశ్విని రెండు రోజులుగా కనిపించడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, అదే సమయంలో ఆమె రంగనాయక సాగర్ లో మృతి చెందినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.
అయితే ఆ యువతి సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకుడితో ప్రేమలో ఉందని, 13వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఆ రోజే ఫిర్యాదు చేశారు. యువకుడి ఇంటికి సైతం వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ యువకుడు ఉండడం, అమ్మాయి దొరక్కపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అమ్మాయి మరణించినట్లు తెలిసింది. తమకు సరైన న్యాయం చేయాలని కోరుతూ.. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.