ప్రతిపక్షం, జూన్ 10: ఖానామెట్ ప్రాంతంలోని సుమారు 15 ఎకరాల విలువైన భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ఈ భూములు ప్రభుత్వానికే చెందినవని స్పష్టం చేస్తూ, వాటిపై హక్కులు కోరుతూ ప్రైవేట్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
భూముల యాజమాన్యాన్ని నిరూపించేందుకు సమర్పించిన పత్రాల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. నకిలీ లేదా అనుమానాస్పద పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములపై హక్కులు సాధించేందుకు ప్రయత్నించడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసిన సంస్థపై రూ.5 లక్షల జరిమానా విధించింది.
భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, పత్రాల తారుమారుపై సమగ్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడిన హైకోర్టు, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూముల రికార్డులు, యాజమాన్య హక్కులు, సంబంధిత లావాదేవీలపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
హైకోర్టు తాజా తీర్పుతో ఖానామెట్ భూముల వివాదానికి కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ భూములను కాపాడటంలో ఈ తీర్పు కీలకంగా మారనుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో భూ అక్రమాలపై కఠిన చర్యలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

















