ప్రతిపక్షం, జూన్ 15: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర నగరాల మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినా, హైదరాబాద్ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తోందని విమర్శించారు.
అహ్మదాబాద్ మెట్రోకు నిధులు, అనుమతులు ఇచ్చిన కేంద్రం, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి విశ్వనగరానికి మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వకపోవడం కేంద్ర వివక్షకు నిదర్శనమని అన్నారు.
మెట్రో ఫేజ్-2 ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పినా, రాజకీయ కారణాలతో కేంద్రం ఆమోదం ఇవ్వడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులను అడ్డుకోవడం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

















