ప్రతిపక్షం, జూన్ 15: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నష్టాల్లోకి వెళ్లడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టు మొదట రూ.15 వేల కోట్ల అంచనాతో ప్రారంభమై, 2017 నాటికి పూర్తికావాల్సి ఉందని గుర్తుచేశారు.
అయితే చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరుతో పనులు ఆలస్యం చేయడంతో ప్రాజెక్టు 2020 వరకు పూర్తికాలేదని పేర్కొన్నారు. ఈ జాప్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు.
మెట్రో విస్తరణ విషయంలో కూడా గత ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లలేదని విమర్శించారు. ప్రజల అవసరాల కంటే కొందరి ఆస్తుల విలువ పెరిగేలా ప్రయోజనం చేకూరే మార్గాల్లో విస్తరణ చేపట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వం నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో ఫేజ్-2 విస్తరణను ముందుకు తీసుకెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.















