హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ విమర్శ

ప్రతిపక్షం, జూన్ 16: హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో రైలు విస్తరణ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఒప్పందాలు పూర్తయినా, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి నిధులు విడుదల కాకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

మెట్రో స్వాధీనం కోసం రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం కుదిరిందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు, ఆర్బీఐ కౌంటర్ గ్యారంటీ కూడా సమర్పించిందని తెలిపారు. జపాన్ ఆర్థిక సంస్థ నుంచి నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలో జమ అయినప్పటికీ, ఎల్‌అండ్‌టీకి చెల్లింపులు జరగలేదన్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఆలస్యాల కారణంగా అది రూ.22 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెట్రో విస్తరణ జరగకపోవడంతో హైదరాబాద్ దేశంలో రెండో స్థానంలో ఉన్న మెట్రో వ్యవస్థ నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయిందని విమర్శించారు.

మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇస్తే, కేంద్ర వాటా లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం ఈక్విటీతో ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరానికి మెట్రో విస్తరణ అవసరమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Spread the love

Related News

Latest News