ప్రతిపక్షం, జూన్ 16: మంచిర్యాల జిల్లాలో సింగరేణి పర్యటనలో పాల్గొన్న టీఆర్ఎస్ చీఫ్ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్కే-7 గని వద్ద గేట్ మీటింగ్కు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, కార్మికుల సమస్యల కోసం టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా మావోయిస్టుల ప్రస్తావన చేస్తూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవిలో అన్నలు ఉండటంతో అధికారుల్లో బాధ్యత ఉండేదని, ఇప్పుడు అడిగే దిక్కు లేదనే భావనతో సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తోందని అన్నారు. అయితే అడవిలో ఉన్న అన్నలంతా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారని, కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
అలాగే గతంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు సింగరేణిలో పర్యటించినప్పుడు తప్పు కానప్పుడు, తాము కార్మికుల సమస్యలు తెలుసుకోవడం ఎందుకు తప్పవుతుందని ప్రశ్నించారు. పోలీసులు పెట్టుకుని ప్రజల గొంతు నొక్కలేరని వ్యాఖ్యానించారు.
















