99 రోజుల ప్రజాపాలనతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 16: మార్చి 16 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన 99 రోజుల కార్యాచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాలను పరిశీలించిన సీఎం, చురుకుగా పనిచేసిన శాఖలను అభినందించారు. క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించని అధికారులు, జిల్లా కలెక్టర్ల వివరాలను సమర్పించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.

గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను నమోదు చేసి పరిష్కరించాలని సూచించిన సీఎం, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగుల హాజరు కోసం ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే జిల్లాల వారీగా 99 రోజుల ప్రగతి సమీక్షలు నిర్వహించి, ప్రత్యేక అధికారులతో నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, అభివృద్ధి పనుల వివరాలను గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉంచాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై నియోజకవర్గాల వారీగా నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Spread the love

Related News

Latest News