ప్రతిపక్షం, జూన్ 16: వ్యవసాయ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బోనస్‌కు అర్హత ఉన్న ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల ద్వారా సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సన్న వడ్లు సాగు చేస్తున్న రైతుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సూచించారు.
ఎరువుల సరఫరాను మరింత పారదర్శకంగా చేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించాలని, రైతులు ముందస్తుగా బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేసే విధానం అమలు చేయాలని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను తెలంగాణ రైతుల అవసరాలకు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత విస్తరించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

















