హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 17: రైతులకు విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోళ్ల వరకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటల నమోదు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ శాఖకు పూర్తి సమాచారం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ, రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రతి దశను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సన్న వడ్లు సాగు చేసే రైతుల పూర్తి డేటాను సేకరించాలని సూచించారు.
రైతు వేదికలను రైతు సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లను అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని విస్తరించాలని, దమ్మపేటలో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టు ఫలితాలను అధ్యయనం చేయాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తయ్యే ఎరువులను తెలంగాణకు అధికంగా కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు.
మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్, ప్రభుత్వ డైరీలను బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు.


















