ప్రతిపక్షం, జూన్ 17: సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గోదావరిఖనిలోని ఆర్జీ-1 సింగరేణి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్య సదుపాయాలు అందాలని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన తర్వాత అదనపు ఖర్చుల భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు.
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి కాలనీల్లో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాపిడ్ ఫిల్టర్ వ్యవస్థ పనులను పూర్తి చేసి వేలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణి వైద్య సేవలను నిలబెడుతున్న వైద్య సిబ్బంది అంకితభావాన్ని ఆమె అభినందించారు.





















