తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

ప్రతిపక్షం, జూన్ 17: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

పాఠశాలలోని డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, రవాణా సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ సరదాగా గడిపారు.

ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేలా ఈ పాఠశాలను రూపొందించారు. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యను కొత్త దిశగా తీసుకెళ్లే కీలక అడుగుగా ఈ పాఠశాల ప్రారంభోత్సవాన్ని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News