ప్రతిపక్షం, జూన్ 17: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోలేరనే అపోహలను తొలగించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యమని అన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరుట్ల పాఠశాల స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఉన్నతాధికారులుగా ఎదగగలరనే విశ్వాసాన్ని సమాజంలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యను భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామని, రాష్ట్ర బడ్జెట్‌లో భారీ మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తున్నామని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో అసమానతలు, వివక్షలను నిర్మూలించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఆరుట్ల పాఠశాలలో అన్ని సీట్లు భర్తీ కావడం, కొత్త ప్రవేశాలకు అవకాశం లేకపోవడం ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి మరిన్ని పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక విద్యా, క్రీడా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.




















