ప్రతిపక్షం, జూన్ 18: వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. ఈ నెల 26న మధిరలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వానాకాలం సాగు అవసరాల కోసం మొత్తం రూ.9,000 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
రైతులకు సాగు ఖర్చుల్లో ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయ కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఊరట లభించనుంది.

















