ప్రతిపక్షం, జూన్ 18: రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న ధరలు రికార్డు స్థాయికి చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోనా) రకం ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906 ధర పలికింది. అలాగే వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న క్వింటా రూ.2,265కు విక్రయమైంది.
గత ఏప్రిల్, మే నెలల్లో ఈ పంటల ధరలు రూ.700 నుంచి రూ.2,000 మధ్యే ఉండగా, ప్రస్తుతం భారీగా పెరగడం విశేషం. వాతావరణ మార్పులు, దిగుబడులపై ఉన్న అనిశ్చితి కారణంగా వ్యాపారులు ముందుగానే పంటలను కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాలతో భవిష్యత్తులో మరింత ధర పెరుగుతుందనే ఆశతో వ్యాపారులు నిల్వలకు ప్రాధాన్యం ఇస్తుండగా, ప్రస్తుతం పెరిగిన ధరలు రైతులకు లాభదాయకంగా మారుతున్నాయి.

















