సింగరేణిలో బ్రిటీష్ పాలన కొనసాగుతోంది.. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తాం: కవిత

ప్రతిపక్షం, జూన్ 18: సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా రామగుండం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు–3, బేస్ వర్క్‌షాప్‌ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కార్మికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటికీ బ్రిటీష్ పాలన తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని, కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే మెమోలు, చార్జిషీట్లు ఇస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు.

అధికారుల ధర్నాలకు అనుమతులు ఉండగా, కార్మికులు నిరసన వ్యక్తం చేస్తే చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. గతంలో అమలులోకి వచ్చిన కొన్ని విధానాల వల్ల కార్మికులకు ఆర్థిక నష్టం జరిగిందని అంగీకరించిన ఆమె, ఆ తప్పిదాలకు క్షమాపణ చెబుతూ వాటిని సవరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో కార్మికులకు లభించాల్సిన ప్రయోజనాలను తిరిగి సాధించేలా పోరాటం చేస్తామని తెలిపారు.

సింగరేణి కార్మికులకు వైద్యం, విద్య రంగాల్లో ఇబ్బందులు పెరిగాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాణ్యమైన విద్య అందించిన పాఠశాలలు ఇప్పుడు సిబ్బంది కొరతతో నడుస్తున్నాయని, వైద్య సేవల కోసం కార్మికులు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రిఫరల్ ఆస్పత్రుల్లో కార్మికుల నుంచి అదనపు వసూళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. పదవీ విరమణకు చేరువైన ఉద్యోగుల కుటుంబాలకు అన్యాయం జరగకుండా అప్లికేషన్ తేదీ ఆధారంగా ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.

ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న యంత్రాల ఆపరేటర్లు తీవ్ర ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని కవిత పేర్కొన్నారు. పాత వాహనాలు, భద్రతా లోపాలు, దుమ్ము కాలుష్యం కారణంగా కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. నీటి ట్యాంకర్ల నిర్వహణలోనూ నిర్లక్ష్యం ఉందని విమర్శించారు.

సింగరేణిలో ఖాళీగా ఉన్న వేలాది క్వార్టర్లను కార్మికుల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని, నివాస సౌకర్యాల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని ఆమె సూచించారు. ఓపెన్‌కాస్ట్, భూగర్భ గనులు రెండూ కొనసాగాలన్నదే తమ విధానమని, భవిష్యత్తులో అన్ని గనులను సంస్థే నేరుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమం, ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం, రైతు గౌరవం, యువతకు ఉపాధి వంటి అంశాలతో తమ పార్టీ ముందుకు సాగుతోందని కవిత తెలిపారు. కార్మికుల సమస్యలను కేవలం ప్రశ్నించడం కాకుండా పరిష్కారం దిశగా పోరాటం చేస్తామని పేర్కొంటూ, కార్మిక సంఘ ఎన్నికల్లో మరియు రాజకీయంగా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Spread the love

Related News

Latest News