ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్.. జూలై 1 నుంచి అమలు

ప్రతిపక్షం, జూన్ 18: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కార్మిక సంఘాల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి ఉద్యోగులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని అధికారులకు తెలిపారు.

అలాగే నాగర్‌కర్నూలు, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఆర్టీసీ డిపోల పనులను వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని మంత్రి పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇందిరమ్మ గృహ పథకం కింద ఇంటి సదుపాయం కూడా కల్పించాలని సూచించారు.

ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఫిట్‌మెంట్ అమలుతో వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

Spread the love

Related News

Latest News