పవన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి: కవిత

ప్రతిపక్షం, జూన్ 18: తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదం, ఉగ్రవాదంతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం చరిత్రను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ప్రజలు సహించరని ఆమె హెచ్చరించారు.

కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కవిత, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం సాగిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడిన ఉద్యమాన్ని వేర్పాటువాదం లేదా ఉగ్రవాదంతో పోల్చడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఉద్యమకారుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.

వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపోవాలని కోరుకోవడం అని, తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ అలాంటి డిమాండ్ చేయలేదని కవిత స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ పరిధిలోనే ప్రత్యేక రాష్ట్ర హక్కు కోసం పోరాటం సాగిందని, దాన్ని తప్పుగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని కవిత స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News