జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో నేరుగా జమ

ప్రతిపక్షం, జూన్ 18: తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వానాకాలం సాగు సీజన్‌కు అవసరమైన పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా మధిరలో భారీ రైతు సమ్మేళనం నిర్వహించి, అదే వేదికపై రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు నేరుగా జమ కానున్నాయి.

ఈ పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వానాకాలం సాగు కోసం రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను సమకూర్చుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. రైతుల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సాగుకు ప్రోత్సాహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

రైతు భరోసా నిధుల విడుదలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై కూడా మధిర సభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Spread the love

Related News

Latest News