ప్రతిపక్షం, జూన్ 19: సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనిని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ కార్మికుడు తన కుటుంబ, ఉద్యోగ సమస్యలను వివరించగా కవిత భావోద్వేగానికి గురై అతనికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సింగరేణి సంస్థ ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తోందని, అలాంటి సంస్థలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల కోసం పనిచేయడమే తమ లక్ష్యమని, బాయిబాట కార్యక్రమం ద్వారా వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని తెలిపారు.
సింగరేణిలో ఇప్పటికీ కార్మికులపై ఒత్తిడి, అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. కార్మికులు తమ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కార్మికులు ఏ సమావేశానికి వెళ్లాలనేది వారి హక్కు అని, వారిపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు.
గనుల్లో ఆధునిక యంత్రాలు, భద్రతా సదుపాయాలు, పనిముట్లు సరిపడా లేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉత్పత్తి లక్ష్యాలు పెంచుతున్నా, కార్మికుల సంక్షేమంపై తగిన దృష్టి పెట్టడం లేదని అన్నారు. గనుల్లో పనిచేసే కార్మికులకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, వాటికి తగిన పరిష్కారాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. అండర్‌గ్రౌండ్ గనుల అభివృద్ధి ద్వారా సంస్థ భవిష్యత్తు మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
సింగరేణికి రావాల్సిన భారీ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం, యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, సింగరేణి అభివృద్ధికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.




















