గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ప్రతిపక్షం, జూన్ 19: హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఘాట్ పరిసరాల్లో రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 83.81 ఎకరాల భూమిలో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అనుమతి తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మూసీ నది పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన వినోద మరియు సాంస్కృతిక వనరుల కల్పన దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ద్వారా మూసీ పరివాహక ప్రాంతాన్ని సాంస్కృతిక, పర్యాటక, ప్రజా వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగర సౌందర్యాన్ని మరింత పెంచే ఈ ప్రాజెక్టు మూసీ నది అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది.

Spread the love

Related News

Latest News