ప్రతిపక్షం, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరై యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది.
విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకునేలా చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ, ప్రతి పాఠశాలలో యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యార్థులందరూ చురుకుగా పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది.
యోగా మన సంస్కృతిలో భాగమని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని విద్యాశాఖ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

















