ప్రతిపక్షం, జూన్ 20: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ కావడానికి ప్రస్తుతం 891 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. ఉద్యోగుల పరస్పర బదిలీల అంశాన్ని పరిశీలించి, తెలంగాణ ప్రభుత్వం తన అంగీకారాన్ని తెలియజేయాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది.
గతంలో తెలంగాణకు వెళ్లేందుకు మొత్తం 1,931 మంది ఉద్యోగులు తమ అభిరుచిని వ్యక్తం చేశారు. అయితే కాలక్రమేణా కొందరు ఉద్యోగులు పదవీ విరమణ పొందగా, మరికొందరు బదిలీలపై ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం గుర్తించింది. తాజా పరిస్థితుల్లో 891 మంది ఉద్యోగులు మాత్రమే తెలంగాణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారికంగా తెలియజేసింది.
రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, పరస్పర బదిలీలు, స్థానికత అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా లేఖతో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మళ్లీ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ పరిణామం ఊరటనిచ్చే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

















