జులై నుంచి భూముల పునఃసర్వే

ప్రతిపక్షం, జూన్ 20: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించి పారదర్శక భూ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ దిశగా జులై నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల పునఃసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మొదటి దశలో రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూ రికార్డులను కచ్చితత్వంతో రూపొందించనున్నట్లు చెప్పారు.

నిజాం కాలం నుంచి భూ పటాలు అందుబాటులో లేని 378 గ్రామాలను ప్రభుత్వం గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐదు గ్రామాల్లో పునఃసర్వే పూర్తి చేసి భూములకు ప్రత్యేక భూధార్ సంఖ్యలు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల సహాయంతో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పునఃసర్వే పూర్తయిన తర్వాత భూముల హద్దులు, యాజమాన్య వివరాలు స్పష్టంగా నమోదవుతాయని, భూ వివాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైతులు, భూ యజమానులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

భూముల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర భూ పరిపాలనలో కీలక సంస్కరణగా నిలవనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Spread the love

Related News

Latest News