నీట్ అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచన

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 20: జాతీయ వైద్య ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నిర్వహించనున్న ఈ కీలక పరీక్షలో ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలకు లోనుకాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని విద్యార్థులకు సూచించారు.

వైద్య విద్యలో ప్రవేశానికి అత్యంత ప్రాధాన్యమైన ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతోకాలంగా కష్టపడి సిద్ధమయ్యారని పేర్కొన్న ముఖ్యమంత్రి, తమ శ్రమ, పట్టుదలపై నమ్మకం ఉంచి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ప్రశాంతమైన మనసుతో పరీక్షకు హాజరైతే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.95 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

పరీక్షా కేంద్రాలకు చివరి నిమిషంలో కాకుండా ముందుగానే చేరుకోవాలని, పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులంతా తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ విజయవంతమైన భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love

Related News

Latest News