ప్రతిపక్షం, జూన్ 20: రాష్ట్రంలో పాడి పరిశ్రమను బలోపేతం చేయడంతో పాటు పాడి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన పాడి పరిశ్రమను మరింత లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ ద్వారా పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పాల ఉత్పత్తి, వినియోగం, రైతులకు చెల్లించాల్సిన బిల్లులు, పాల సేకరణ వ్యవస్థపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థులకు పాలు సరఫరా చేయాలంటే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పాల ఉత్పత్తిపై ఖచ్చితమైన సమాచారం అవసరమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పాలిచ్చే పశువుల సంఖ్య, పాల ఉత్పత్తిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలని, పాల రైతులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలకు సరఫరా చేసే పాలకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు నేరుగా సంబంధిత విభాగాలకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. దీంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం ఉండదని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, వారికి సమయానికి చెల్లింపులు జరిగితే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు డెయిరీలపై నమ్మకం పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాడి పరిశ్రమను మరింత లాభసాటిగా మార్చేందుకు ఆధునిక సాంకేతికత, మెరుగైన నిర్వహణ విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను రైతులకు అదనపు ఆదాయ వనరుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

















