హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 23: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా దారుల్ షిఫాలోని బీబీకా ఆలంను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు, నిర్వాహకులతో మాట్లాడి మొహర్రం ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, మొహర్రం ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అషూర్ ఖానాల నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
మొహర్రం అంటే హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కర్బలా యుద్ధభూమిలో మానవీయ విలువలు, సత్యం, న్యాయం కోసం చేసిన మహా త్యాగం గుర్తుకు వస్తుందని కవిత పేర్కొన్నారు. ఆయన చూపిన ధర్మబద్ధమైన మార్గం, త్యాగస్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నుంచి అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలు జరుపుకునే గొప్ప సంప్రదాయం ఉందని గుర్తుచేశారు. బీబీకా ఆలం ఊరేగింపు రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అందులో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా ఉండేదని పేర్కొన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ కేటాయింపులు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని అన్నారు.
మైనార్టీ వర్గాలకు సంబంధించిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి, మతపరమైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

















