ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణను పారిశ్రామిక రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన ఆయన, ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలో భారీ పెట్టుబడులతో అంతర్జాతీయ స్థాయి పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామిక సంస్థలకు అనుకూలంగా లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు.
అదేవిధంగా తెలంగాణకు ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో జాతీయ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మెగా లెదర్ పార్కుల కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. మెదక్ జిల్లాలో ప్రతిపాదిత మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు ఆమోదం, ఎగుమతుల మౌలిక సదుపాయాల కోసం నిధుల కేటాయింపు అంశాలను కూడా ప్రస్తావించారు.
పామ్ ఆయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దిగుమతి సుంకాల పునరుద్ధరణతో పాటు, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణ అవసరాలకు ప్రాధాన్యంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.

















