ప్రతిపక్షం, జూన్ 23: హైదరాబాద్‌లో భూమి కేటాయింపు విషయంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయత్‌నగర్ ప్రాంతంలో 600 గజాల స్థలాన్ని ఆయనకు కేటాయించగా, ఆ స్థలానికి సంబంధించిన పట్టాను రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అందజేశారు.
అయితే పట్టా అందుకున్నప్పటికీ ఇప్పటివరకు భూమి తన పేరుపై రిజిస్ట్రేషన్ కాలేదని మొగులయ్య వాపోయారు. ఈ విషయమై పలుమార్లు అధికారులను సంప్రదించినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న కళాకారుడికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసి మొగులయ్యకు న్యాయం చేయాలని కళాభిమానులు, ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

















