జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి

జిల్లా కలెక్టర్,ఎస్పీకి మెదక్ జర్నలిస్టుల వినతిపత్రాలు

ప్రతిపక్షం, ప్రతినిధి మెదక్, జూన్ 23: నార్సింగి మండల మన తెలంగాణ విలేకరి శ్రీ రాఘవేందర్ పై జరిగిన దాడి ఘటనను మెదక్ జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం బాధితునితో కలిసి మెదక్ జిల్లా జర్నలిస్టులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి, టీయూడబ్ల్యూజె (143) జిల్లా నేత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై వార్త ప్రచురించిన నేపథ్యంలో విలేకరి రాఘవేందర్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం జర్నలిస్టుల విధి అని, తమ వృత్తి బాధ్యతలను నిర్వర్తించే మీడియా ప్రతినిధులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిందని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇటువంటి దాడులు జర్నలిస్టుల్లో భయాందోళనలు కలిగించడమే కాకుండా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రమాదం ఉందన్నారు. రాఘవేందర్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.మీడియా ప్రతినిధుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఉపేక్షించరాదని తెలిపారు. జర్నలిస్టులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా మెదక్ జిల్లా అధ్యక్షుడు బొందుగుల నాగరాజు,రాజశేఖర్, తిమ్మన్నగారి శ్రీధర్, నాగరాజు శర్మ, ఫారుక్ హుస్సేన్, మువ్వనవీన్, గోపాల్ గౌడ్,కామాటి కృష్ణ, లక్ష్మి నారాయణ, పాపన్నపేట శ్రీనివాస్, శ్రీనివాస్ చారి, సందీప్, గోవర్ధన్ రెడ్డి, ఖయ్యుమ్, నీలం, చల్ల రాహుల్, రాఘవులు, మల్లేష్, కార్తీక్, శ్రీహరి, సంగమేష్, రహమాత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News