ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులపై సమన్వయంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రితో జరిగిన సమావేశం అనంతరం, ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రులతో కలిసి మరో ఉమ్మడి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన సహకారం అందేలా సమన్వయం కొనసాగిస్తానని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన మౌలిక వసతులు, రవాణా, పట్టణాభివృద్ధి వంటి అంశాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సహకారం కొనసాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర స్థాయిలో మరింత చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు.

















