ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి.. బీఎల్‌ఏలదే కీలక బాధ్యత: మహేష్ కుమార్ గౌడ్

ప్రతిపక్షం, జూన్ 23: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సంగుపేట్‌లో నిర్వహించిన ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్‌ఏల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని కీలక సూచనలు చేశారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రతి బీఎల్‌ఏ పూర్తి అవగాహనతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటం పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

ఒక్క ఓటు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి కలిగి ఉంటుందని, అదే ఓటు ప్రభుత్వాలను గద్దె దించే సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందువల్ల బూత్ స్థాయిలో పనిచేసే బీఎల్‌ఏలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని సూచించారు.

ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నికల సంఘంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి పారదర్శక ఓటర్ల జాబితా ఎంతో అవసరమని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ముందుకు సాగుతోందని పేర్కొన్న ఆయన, ఇప్పటికే గణనీయమైన శాతం హామీలు అమలయ్యాయని తెలిపారు. మహిళా సాధికారత, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు.

అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు విలువైనదని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News