ప్రతిపక్షం, జూన్ 25: పెళ్లి సంబంధం పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ కుటుంబాన్ని భారీగా మోసం చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హస్తినాపురానికి చెందిన పార్వతి తన కుమారుడికి వివాహ సంబంధం కోసం ఓ వివాహ పరిచయ వేదికలో నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువతినని పరిచయం చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు.
పెళ్లి ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాల పేరుతో దశలవారీగా డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. కుటుంబ సభ్యులు నమ్మకంతో పలుమార్లు నగదు పంపించగా, మొత్తంగా రూ.21.69 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పెళ్లికి నిరాకరించి, సంబంధాన్ని తెంచుకోవడంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు.
దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ మోసగాళ్ల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. వివాహ పరిచయ వేదికల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల వివరాలను పూర్తిగా ధ్రువీకరించుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

















