ప్రతిపక్షం, జూన్ 25: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక పరిశీలన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం జూలై 24 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను చేపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35,985 మంది బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేయనున్నారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా కూడా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ ప్రక్రియ అనంతరం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఓటర్లందరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

















