ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ బాధ్యత.. బీమా రక్షణతో భరోసా: రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో విశ్వాసం, భద్రత పెంపొందించడమే లక్ష్యంగా బీమా రక్షణ కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల బీమా రక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రుల సమక్షంలో వివిధ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకలాంటి వారని అన్నారు. సింగరేణి, విద్యుత్, రవాణా సంస్థలు సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం, భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు. ఉద్యోగులు అడగకపోయినా వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా బీమా రక్షణ అందిస్తున్నామని చెప్పారు.

సింగరేణి కార్మికులకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ విస్తరించామని తెలిపారు. విధి నిర్వహణలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని విమర్శించిన ముఖ్యమంత్రి, ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు. వంద రోజుల్లో ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే తొలి విడత నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.

వేతన సవరణ అంశంపై కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్ను ఎగవేతలను అరికట్టడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని కోరారు. రోజుకు ఒక గంట అదనంగా పనిచేసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, తక్కువ ధరకు వంటగ్యాస్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అల్పాహార పథకం, మహిళా సంఘాలకు రుణాల అనుసంధానం వంటి సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలులో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు కీలకమని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే నిజమైన రాయబారులు ఉద్యోగులేనని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి వంటి ప్రాజెక్టులు అత్యంత కీలకమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తెలంగాణను 2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం అత్యవసరమని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News