ప్రతిపక్షం, జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని, పన్నులు ఎగవేసే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉందని పేర్కొన్నారు.
ఆదాయం పెరిగితే ఉద్యోగుల సంక్షేమం, వారి అవసరాల కోసం మరింతగా నిధులు వినియోగించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విజయవంతమైన అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
ప్రభుత్వానికి ఉద్యోగులే వారధులు, సారథులని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేసే ప్రధాన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేతన సవరణ అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
















