ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జూన్ 26 : డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని , యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యత అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐఎంఏ డాక్టర్స్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమం 2కే రన్ కార్యక్రమం జరిగింది. పాల్గొన్న ముఖ్యఅతిధి మాట్లాడుతూ దేశ బలం యువతేనని , వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే కుట్రలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న రెండు నుంచి మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు , ఇంటర్మీడియట్ కళాశాలలు , ప్రొఫెషనల్ కళాశాలల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సే నో టూ డ్రగ్స్ – సే ఎస్ టూ లైఫ్ అనే సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డాక్టర్ కవిత రెడ్డి మాట్లాడుతూ , రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలీస్ శాఖలో ఈగల్ (EAGLE) బృందం డ్రగ్స్ నియంత్రణ కోసం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.2కె రన్ కార్యక్రమము పోలీస్ కమిషనర్ గారు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభమై – రైల్వే కమాన్ – పోలీస్ పరేడ్ గ్రౌండ్ – ఎన్టీఆర్ చౌరస్తా – ఆర్ అండ్ బి ఆఫీస్ – రైల్వే స్టేషన్ – జిల్లా ఫైర్ స్టేషన్ – పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు జరిగింది.
















