విద్యార్థుల గొంతుకకు కాంగ్రెస్ వేదిక.. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ప్రారంభం

ప్రతిపక్షం, జూన్ 26: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ భూరియా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్, నీట్ విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి దేశవ్యాప్తంగా చేపట్టనున్న కార్యాచరణను వివరించారు.

ఈ సందర్భంగా విక్రాంత్ భూరియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు, యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకులు, నిరుద్యోగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటం ప్రారంభించిన రాహుల్ గాంధీ పిలుపులో భాగంగానే ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత తమ సమస్యలు, సూచనలు, అనుభవాలను నేరుగా వెల్లడించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. యువత తమ గొంతును వినిపించి విద్యా రంగంలో మార్పులకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ రాజకీయ కార్యక్రమం కాదని, దేశ యువత భవిష్యత్తు కోసం ప్రారంభమైన జాతీయ ఉద్యమమని అన్నారు. విద్య, ఉపాధి, సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

Spread the love

Related News

Latest News