ప్రతిపక్షం, జూన్ 27: తెలంగాణను నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ ప్రముఖ సంస్థల నుంచి విశేష మద్దతు లభిస్తోందని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందిస్తూ అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా ష్నైడర్ ఎలక్ట్రిక్‌లో 47 మంది, టాటా మోటార్స్ (పుణే)లో 36 మంది, ఫాక్స్‌కాన్ ఆపిల్ ఐఫోన్ విభాగంలో 14 మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. బ్లూ కాలర్ ఉద్యోగాల రంగంలో తెలంగాణను దేశానికే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, శిక్షణ నుంచి ఉద్యోగం వరకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తూ, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ మరో మైలురాయి సాధించబోతుందని ఆయన పేర్కొన్నారు.

















