ప్రతిపక్షం, జూన్ 27: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ కార్మికులు చేసిన 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉద్యోగులకు మంజూరు చేసిన 11 శాతం పీఆర్సీని జులై నెల జీతాల నుంచే అమలు చేస్తామని ప్రకటించారు.
అలాగే గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని, అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఏర్పాటయ్యే కమిటీలో కార్మిక ప్రతినిధులకు కూడా స్థానం కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా విలీన ప్రక్రియకు సమగ్ర విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

















