ప్రతిపక్షం, జూన్ 27: అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు, ఆలయ ఆభరణాల అక్రమాలపై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామాలయానికి చెందిన వజ్రాల హారం, వెండి ఇటుకలు సహా సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు మాయమైనట్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో బీజేపీ నేతల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని విమర్శించారు.
ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు జరగాలంటే వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ చేపట్టాలని సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ అంశంలో నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.

















