ప్రతిపక్షం, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ-జీఆర్‌ఏఎంజీ’ చట్టాన్ని ప్రస్తుత రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సబ్‌కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ చట్టం ద్వారా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కేంద్రం క్రమంగా హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేపడతామని తెలిపారు. ఈ మేరకు కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జులై 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

















