ప్రతిపక్షం, జూన్ 27: హిమాయత్‌నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన **”చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన సభ”**లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ అమలుకు దేశవ్యాప్తంగా మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చిన కవిత, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించి మహిళల శక్తిని చాటాలని సూచించారు. బిల్లు అమలు చేయకపోతే మహిళలు ఓట్ల ద్వారా తమ నిరసనను తెలియజేసే పరిస్థితి తీసుకురావాలని అన్నారు.
మహిళలు రాజకీయాల్లో నిర్ణయాత్మక స్థానాల్లో ఉంటేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, అందుకే 33 శాతం మహిళా రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు కావాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. మహిళలు ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత అడ్డంకులు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించాలంటే రిజర్వేషన్లు కీలకమని పేర్కొన్నారు.
2022–23లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టడంతో పాటు 18 రాజకీయ పార్టీలతో కలిసి పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ జరిగేలా కృషి చేశామని కవిత గుర్తు చేశారు. అయితే బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు.
మహిళలతో పాటు బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, తమ పార్టీ మహిళలకు కనీసం 33 శాతం, అర్హత ఉన్న చోట 50 శాతం వరకు టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
మహిళల రాజకీయ సాధికారత కోసం ప్రజాక్షేత్రంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని, మహిళల గౌరవం, హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.




















