ప్రతిపక్షం, జూన్ 29: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మూసీ నది ప్రక్షాళన పనులను పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనగల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన తన కల అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
మూసీ కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మూసీ నది ప్రక్షాళన చేపడుతున్నామని, ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని చెప్పారు.
గత 30 నెలల ప్రభుత్వ పాలనపై ఎప్పుడైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజా ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు జారీ చేసిందని, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
రైతుల సంక్షేమం కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసి, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని సీఎం వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపడంతో పాటు కులగణన చేపట్టామని, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా వ్యవస్థను విస్తరించి, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధితో తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



















