ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణ భాషలోని ‘ఇడుపు కాయితం’ పదంపై టీఆర్ఎస్ చీఫ్ కవిత చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది.
‘ఇడుపు కాయితం అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్‌ను అడగాలని చెప్పిన మీరు, ముందుగా చిప్పకూడు అంటే ఏమిటో ప్రజలకు వివరించండి’ అంటూ జనసేన ట్వీట్ చేసింది. అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో హద్దులు దాటొద్దని హెచ్చరించింది.
పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేసిన జనసేన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇతరులపై విమర్శలు చేయడం సరికాదని మండిపడింది. ఈ వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది.
















