2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

  • 2034 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యం
  • అన్ని జిల్లా కేంద్రాలకు హైదరాబాద్ స్థాయి కనెక్టివిటీ
  • 30,000 ఎకరాల్లో నెట్-జీరో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’
  • 200 ఎకరాల్లో ఏఐ సిటీ, గ్రీన్ ఫార్మా హబ్
  • ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులు
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’
  • మహిళల స్వయం సహాయక సంఘాలకు రూ.21,000 కోట్ల రుణాలు
  • ఎంఎస్‌ఎంఈలకు లీజు భూమి, ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్స్
  • తెలంగాణ అభివృద్ధికి శ్రీధర్ బాబు మెగా విజన్

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ /హైదరాబాద్, జూన్ 29: తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్, భారత స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం అయిన 2047 నాటికి $3 ట్రిలియన్కు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5 శాతంగా ఉందని, దానిని 10 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం పాలన, పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఏడాది రూ.21,000 కోట్ల రుణాలు అందించామని, ఎన్‌పీఏలు దాదాపు సున్నా స్థాయిలో ఉండటం మహిళల ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పారు.పెట్టుబడిదారుల విశ్వాసానికి విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య విధానాలే కారణమని పేర్కొన్న మంత్రి.. టీఎస్-ఐపాస్ ద్వారా 21 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయని, Ease of Doing Business 2.0తో మరింత పారదర్శకత, రియల్‌టైమ్ ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా 30,000 ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని నెట్-జీరో, కాలుష్యరహిత నగరంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో 200 ఎకరాల్లో ఏఐ సిటీ, గ్రీన్ ఫార్మా యూనిట్లు, ఆధునిక నివాస ప్రాంతాలు, దేశంలోనే తొలి ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అలాగే ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు, ఎంఎస్‌ఎంఈల కోసం వచ్చే ఐదేళ్లకు రూ.600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భూమిని కొనుగోలు చేయకుండా లీజు విధానం అమలు చేస్తున్నామని, కొత్త పార్కుల్లో 25 శాతం స్థలాన్ని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించేందుకు ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఎదుగుతోందని పేర్కొన్న మంత్రి.. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అన్ని జిల్లా కేంద్రాలకు హైదరాబాద్ స్థాయి కనెక్టివిటీ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నియంత్రణాధికారిగా కాకుండా పరిశ్రమలకు సహాయకారిగా వ్యవహరిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.

Spread the love

Related News

Latest News